
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితా పేరుతో మహా దోపిడీ కొనసాగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో మొత్తం 2 కోట్ల 77 లక్షల ఎకరాలుంటే ఏకంగా 95 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెడతారా అని నిలదీశారు. తెలంగాణలో ఏనుగులు మింగేటోడు పోయి పీనుగలు మింగేటోడు వచ్చాడని దుయ్యబట్టారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం అమ్మిన భూములను, హెచ్ఎండీఏ వేలం వేసిన భూములను, ప్రజలు కష్టపడి డబ్బులు చెల్లించి కొనుక్కున్న భూములను, పరిశ్రమలకు అమ్మిన భూములను కూడా 22ఏలో పెడతారా? అని మండిపడ్డారు. ఆ జాబితా నుండి మా భూములను తొలగించాలంటూ ఏళ్ల తరబడి చెప్పులరిగేలా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా రెండున్నరేళ్లుగా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు అడ్వాన్స్ గా వేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పాత ఫీజుల బకాయిలే ఇంకా ఇవ్వలేదు వచ్చే ఏడాది నుండి అడ్వాన్స్ గా జమ చేస్తామంటే నమ్మేదెలా? అని ప్రశ్నించారు. కోర్టు మెట్టికాయలేసినా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు అడ్వాన్స్ గా జమ చేస్తామంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు చిత్తు శుద్ధి ఉంటే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిటి భస్మాసుర హస్తమైందని విమర్శించారు. 21 ఏళ్లకే యువత చట్ట సభలకు వచ్చేలా తీర్మానం చేస్తామంటే కాదనే వారెవరు లేరని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్కు చిత్త శుద్ధి ఉంటే జెన్ జీకి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలన్నారు. జెన్ జీ లారా... కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతల మాటల వెనుక ఉన్న అంతరార్ధాన్ని గుర్తించి నిలదీయాలని, అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న బీజేపీకి తెలంగాణలో అవకాశమివ్వాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల అప్పు చేస్తే.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో 3 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేయడం బీఆర్ఎస్కు అలవాటుగా మారితే... 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా హామీల పేరుతో మోసాలను కంటిన్యూ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబమే దోచుకుంటే... కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంతో పాటు ఢిల్లీ పెద్దలకు కూడా దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ జనాభా 3.5 కోట్లుంటే 3
కోట్ల 43 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో 30 లక్షల మంది ఇన్ కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు కదా వారికి కూడా బియ్యం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాయని హామీలిచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియవా? అని ప్రశ్నించారు. 50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలకు ఆ మాత్రం తెలియకుండానే అడ్డగోలు హామీలిస్తారా? అని నిలదీశారు. 12 ఏళ్లలో తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదన్నారు. హైవేలు, ట్రిపుల్ ఆర్ కోసమే రూ.1.74 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసం మరో రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని డబుల్ ఇంజిన్ సర్కాతోఁనే మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు