
ఆసిఫాబాద్, 16 ఆగస్టు (హి.స.)
విద్యార్థుల చదువుతో పాటు
ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. ఆదివారం జైనూర్ మండలంలోని కేజీబీవీ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని తరగతి గదులు, వంటగదితో పాటు పరిసరాలను పరిశీలించారు. అమలు చేస్తున్న మెనూ, కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. స్థానిక అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. విధుల నిర్వహణ, మెనూ అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. అలాగే పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై పలు సలహాలు, విలువైన మార్గదర్శకాలను అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు