బోనాల వేడుకల్లో నటి ఫరియా అబ్దుల్లా.. ట్రోల్స్ పై స్పందించిన బీజేపీ చీఫ్
బోనాల వేడుకల్లో నటి ఫరియా అబ్దుల్లా.. ట్రోల్స్ పై స్పందించిన బీజేపీ చీఫ్
BJP


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో

పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్పై తెలంగాణ బీజేపీ నేత ఎన్. రాంచందర్ రావు స్పందించారు. ఆమెపై వస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. భారతదేశం లౌకిక దేశం. ఇక్కడ ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఫరియా అబ్దుల్లాను నిర్వాహకులు ఆహ్వానిస్తేనే ఆమె బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఆహ్వానం మేరకు హాజరైన వ్యక్తిపై ఇలాంటి అసభ్యకరమైన విమర్శలు చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు అని ఆయన పేర్కొన్నారు.

తనపై జరుగుతున్న ట్రోల్స్ క్స్కు సమాధానంగా ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మతపరమైన హద్దులు లేకుండా అన్ని సంస్కృతులను గౌరవించే తన ఆలోచనను ఆమె ఈ వీడియో ద్వారా పంచుకున్నారు. గతవారం హైదరాబాద్లోని మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనం సమర్పించి, పోతురాజుల విన్యాసాల మధ్య ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. తెలంగాణ సంస్కృతిని, అక్కడి ప్రజల ఆప్యాయతను ఆమె ప్రశంసించారు. అయితే, ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ కొందరు సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా నెటిజన్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా

మద్దతు ప్రకటిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande