
హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)
భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ రంగంలో ఒక భారీ మరియు చారిత్రాత్మక ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. జర్మనీ సహకారంతో సుమారు 70,000 కోట్ల రూపాయల వ్యయంతో ఆరు అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను (Submarines) దేశీయంగా నిర్మించే ప్రతిష్టాత్మక 'ప్రాజెక్ట్-75(ఐ)' ప్రతిపాదనకు సంబంధించిన కీలక చర్చలు నిన్న అర్ధరాత్రి ముగిశాయి. ఈ మెగా డీల్‌కు సంబంధించిన తుది ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ముందుకు ఈ ప్రతిపాదన త్వరలోనే వెళ్లనున్నట్లు విశ్వసనీయ రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ కదలికలు, వ్యూహాత్మక సవాళ్లు పెరుగుతున్న తరుణంలో, భారత నావికా దళానికి ఈ సబ్‌మెరైన్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ ప్రాజెక్టు కింద అత్యాధునిక 'ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్' (AIP) సాంకేతికతతో కూడిన జలాంతర్గాములను తయారు చేస్తారు, ఇవి ఎక్కువ రోజుల పాటు నీటి అడుగున ఉండి శత్రువుల కళ్లు గప్పి దాడి చేయగలవు.
ఈ ఒప్పందం ద్వారా కేవలం జలాంతర్గాముల కొనుగోలు మాత్రమే కాకుండా, 'మేక్ ఇన్ ఇండియా' పరిధిలో సాంకేతిక బదిలీ (Transfer of Technology) కూడా జరగనుంది. దీనివల్ల భారతీయ షిప్‌యార్డ్‌లలో వీటి నిర్మాణం జరిగి, స్థానికంగా రక్షణ రంగంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయడం మరియు జర్మనీతో చర్చలు సఫలం కావడం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. వ్యూహాత్మకంగా భారత్‌కు ఇదొక పెద్ద విజయంగా రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ ఉదయం నాటికి ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి ముసాయిదా సిద్ధమైనట్లు, త్వరలోనే ఇరు దేశాల రక్షణ శాఖల ప్రతినిధులు దీనిపై అధికారికంగా సంతకాలు చేయనున్నట్లు ++సమాచారం. దేశ సరిహద్దుల రక్షణలో ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలిచిపోనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi