తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. TG SAFE ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ను రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది.
Revanthreddy


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ను (TG SAFE) రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది. ఆహార భద్రత, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల విలీనానికి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలు ఇకపై ఏకీకృత పరిపాలన కింద పనిచేయనున్నాయి. ఆహారం, మందులు, కాస్మెటిక్స్పై లైసెన్సింగ్, తనిఖీలు, శాంప్లింగ్, పరీక్షలు, ఎన్ఫోర్స్మెంట్ను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేయనుంది.

TG SAFEలో డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్ఫోర్స్మెంట్, లీగల్ & ప్రాసిక్యూషన్, ల్యాబొరేటరీ, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు పనిచేయనున్నాయి. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఒకే ల్యాబొరేటరీ విభాగం కిందకు ప్రభుత్వం తీసుకురానుంది. అక్రమాలు, కల్తీపై నిఘా పెంచేందుకు ఇంటెలిజెన్స్, రిస్క్ ఆధారిత తనిఖీలను TG SAFE చేపట్టనుంది. ఎన్ఫోర్స్మెంట్ కోసం TG SAFEకు పోలీసు సిబ్బందిని డీజీపీ కేటాయించనున్నారు. తొలిదశలో క్యూర్ ప్రాంతంలో TG SAFE కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

క్యూర్ ప్రాంతంలో ఆహార వ్యాపారాలు, డ్రగ్స్ సంస్థలు అధికంగా ఉన్నందున ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఫుడ్, డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థ ఆధునీకరణకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేయనుంది. టెస్టింగ్, ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, లీగల్ సపోర్ట్, ల్యాబ్ మౌలిక వసతులపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. TG SAFE ఏర్పాటు ద్వారా ప్రజారోగ్యం, వినియోగదారుల భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. ఆగస్టు 15, 2026 నుంచి TG SAFE ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 67 జారీ చేసింది.

టీజీ సేఫ్ కమిషనర్గా అవినాశ్ మొహంతి

టీజీ సేఫ్ కమిషనర్గా అవినాశ్ మొహంతిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అవినాశ్ మొహంతికి అదనపు బాధ్యతలను రాష్ట్ర సర్కార్ అప్పగించింది. ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాశ్ మొహంతి ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాల సమన్వయానికి TG SAFEను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు విభాగాలను యూనిఫైడ్ అడ్మినిస్ట్రేషన్గా ఏర్పాటు చేసింది.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande