దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, ఉపాధి అవకాశాల కోసం పోరాటం.. హరీష్ రావు
దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, ఉపాధి అవకాశాల కోసం పోరాటం.. హరీష్ రావు
Harish Rao


హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)

దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, ఉపాధి అవకాశాల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు తెలిపారు. ఎల్బీనగర్లో నిర్వహించిన దివ్యాంగుల “సమర శంఖారావం” సభలో పాల్గొన్న ఆయన.. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, వారి న్యాయమైన డిమాండ్లపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు.

దివ్యాంగులు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, సమాజంలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో వారికి భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని హరీశ్ రావు అన్నారు. వారి గళం శాసనసభలోనూ బలంగా వినిపించేలా తాము పోరాడతామని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగుల పింఛన్ను గణనీయంగా పెంచడంతో పాటు, గృహ పథకాల్లో 5 శాతం, విద్యా, ఉద్యోగ రంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించామని హరీశ్ రావు గుర్తు చేశారు. దివ్యాంగుల హక్కుల చట్టం అమలులో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande