
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ వాసులకు టీజీఎస్ ఆర్టీసీ మరిన్ని సేవలందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ రాత్రి 11, 12 గంటల వరకూ నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్ని.. సిటీలో ఇకపై రాత్రంతా నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమలు చేయనున్నది. ఈ మేరకు తాజాగా ఏయే రూట్లలో సిటీ బస్సుల్ని నడపనున్నారో షెడ్యూల్ ను ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆర్టీసీ బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత ఆరు మార్గాల్లో బస్సుల్ని నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్- కొండాపూర్, బాచుపల్లి - వేవ్ రాక్, సికింద్రాబాద్ - హయత్ నగర్, కోఠి - పటాన్ చెరు, కోఠి - హైటెక్ సిటీ, సికింద్రాబాద్ -పటాన్ చెరు రూట్లలో సర్వీసుల్ని నడపనున్నది. రాత్రి వేళలో గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కష్టాలు ఇకపై తీరనున్నాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే.. నగరమంతా రాత్రివేళల్లోనూ ఆర్టీసీ బస్సుల్ని నడపాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు