క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ .. ఖానాపూర్ ఎమ్మెల్యే
క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ .. ఖానాపూర్ ఎమ్మెల్యే
MLA


ఆదిలాబాద్, 29 ఆగస్టు (హి.స.) క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా ర్యాలీలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శించిన నృత్యాలను తిలకించిన ఎమ్మెల్యే వారిని అభినందించారు.

ఇటీవల వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాణించిన క్రీడాకారులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి వారి ప్రతిభను అభినందించారు. అనంతరం క్రీడా విద్యార్థులకు స్వయంగా క్రీడా సామగ్రి కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించవచ్చని, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు క్రీడా రంగంలో తమ ప్రతిభను చాటుతూ తమ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు తనవంతు సహాయసహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యువత చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకుని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande