
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రహ్మత్ బేగ్ను అర్థరాత్రి ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారణం చెప్పాలని డిమాండ్ చేశారు. రహ్మత్ బేగ్పై గతంలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డాడని, అలాగే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు మీవాళ్లే ఆరోపిస్తున్నారని అన్నారు. గతంలో వచ్చిన భూకబ్జా ఆరోపణల సమయంలో ఒవైసీకి వాటా అందడం వల్ల చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. రహ్మత్ బేగ్ కి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు కొందరి దగ్గర ఉన్నాయని, అవి బయటికి వస్తే పార్టీ పరువు, తన పోతుందని ఒవైసీ రాత్రికి రాత్రే సస్పెండ్ చేశారని రాజాసింగ్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఓవైసీ మీడియా ముందుకొచ్చి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని దారుస్సలాంలో కూర్చుని నేషనల్ మీడియాలో మాట్లాడే ఒవైసీకి రహ్మత్ బేగ్ విషయంలో వాస్తవం ఏంటో మాట్లాడే దమ్ము ఉందా అని నిలదీశారు. ఈ మేరకు రాజాసింగ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు