నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్
నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్
Collector


పెద్దపల్లి, 29 ఆగస్టు (హి.స.)

జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్-పీజీ 2026 పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం డీసీపీ రామ్డ్డితో కలిసి పెద్దపల్లి మండలం పెద్దకల్వలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్దపల్లి బండారికుంట సమీపంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీట్-పీజీ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచి 8:45 గంటల వరకు మాత్రమే పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.

అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుతోపాటు ఒరిజినల్ పర్మినెంట్, ప్రొవిజనల్ ఎంబీబీఎస్ అర్హత ధ్రువీకరణ పత్రం, దాని స్వీయ ధ్రువీకరించిన జిరాక్స్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించారు. ప్రవేశపత్రాన్ని నిర్దేశిత విధంగా ఒకే ఏ4 పేపర్పై రంగుల్లో ముందు, వెనుక ముద్రించుకోవాలని తెలిపారు.పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీఎస్ సీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఆరోగ్య సహాయకులను ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు.

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ నిఘా, మొబైల్ జామర్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి అభ్యర్థికి హెచ్ఎచ్ఎండీ తనిఖీ, మాన్యువల్ బాడీ ఫ్రిస్కింగ్ నిర్వహించాలని తెలిపారు. నమోదు సమయంలో ఆధార్ ధ్రువీకరణ, ఫొటో, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, ముఖ గుర్తింపు, బార్కాడ్ స్కానింగ్ వంటి నిర్దేశిత ప్రక్రియలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారాలు, ఆభరణాలు, షూస్ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.పరీక్ష పర్యవేక్షణ కోసం జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రశ్నపత్రం ఐదు సమయ పరిమితి విభాగాలుగా ఉంటుందని, ఒక్కో విభాగానికి 42 నిమిషాల సమయం ఉంటుందని చెప్పారు. అభ్యర్థులకు నీళ్ల సీసా అందిస్తామని, రఫ్ షీట్, పెన్ను అందించబడవని తెలిపారు. పరీక్ష ప్రారంభానికి ముందు నమోదు ప్రక్రియ పూర్తైన అనంతరం అభ్యర్థులకు బయో బ్రేక్లకు అనుమతి ఉండదని పేర్కొన్నారు.

సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని, పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande