
సికింద్రాబాద్, 29 ఆగస్టు (హి.స.)
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ శుక్రవారం రాత్రి వరంగల్ రైల్వే స్టేషన్ను సందర్శించి, అక్కడ ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులు, స్టేషన్ నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్ రాకముందు ఆయన సికింద్రాబాద్-కాజీపేట ప్రధాన రైలు మార్గంలో రాత్రివేళ ఫుటేట్ తనిఖీ నిర్వహించారు. సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్లే ఎక్స్ప్రెస్ (12745) లోకోమోటివ్ (ఇంజిన్)లో ఎక్కి కాజీపేట వరకు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో ట్రాక్ భద్రత, సిగ్నలింగ్ వ్యవస్థ పనితీరు, ఓవర్హెడ్ ఎలక్ట్రికల్ లైన్లు, వేగ పరిమితుల అమలు తదితర కీలక అంశాలను స్వయంగా పరిశీలించారు. విధి నిర్వహణలో లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, గార్డులతో పాటు మార్గమధ్యంలోని స్టేషన్ మాస్టర్లు, గేట్మెన్లు, పాయింట్స్మెన్ల అప్రమత్తతను గమనించి వారికి పలు భద్రతా సూచనలు చేశారు.
వరంగల్ చేరుకున్న జీఎం, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధునికీకరణ పనులను పరిశీలించారు. 12 మీటర్ల వెడల్పయిన అత్యాధునిక పాదచారుల వంతెన (ఫుటైవర్ బ్రిడ్జి), ఆధునిక ప్రవేశ ద్వారం (ఎంట్రన్స్ పోర్టికో), విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ప్లాట్ఫామ్ షెల్టర్లు, నూతనంగా ఏర్పాటు చేస్తున్న లిఫ్టులు, ఎస్కలేటర్ల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు