
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
రామ్ లీలా మైదాన్ శుద్ధికరణ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు (Ramachander Rao) తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ ఉదయం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రామ్ లీలా మైదాన్లో జరిగిన పూజా కార్యక్రమాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అక్కడ జరిగిన క్రతువులో దళితులు కూడా పాల్గొన్నారని స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే (Mallikarjan Kharge) అక్కడ ప్రసంగించినందుకో.. పర్యటించినందుకో ఆ కార్యక్రమం జరగలేదని, వేరే కారణంతో జరిగిందని అన్నారు. ఆ విషయం రాహుల్ గాంధీకి తెలిసినప్పటికీ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రామచందర్ రావు ఫైర్ అయ్యారు.
రాహుల్ గాంధీ ఏ రకంగానైనా దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని రామచందర్రావు ధ్వజమెత్తారు. దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారని, ఉత్తరప్రదేశ్ (Uttar Preadesh) వెళ్లినప్పుడు కులాల ప్రాతిపదికన విభాగాలు తెస్తారని ఆరోపించారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ ఈ పనులన్నీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ (B.R Ambedkar)కు వ్యతిరేకంగా పనిచేసిందని, ఆయనను ఎన్నికల్లో ఓడించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎన్నడూ అంబేడ్కర్కు భారతరత్న ఇవ్వలేదని, ఆయనను తీవ్రంగా అవమానించిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మల్లికార్జున ఖర్గే నిజంగా నిజమైన దళిత నేత అయితే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని రామచందర్రావు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..