
అమరావతి, 31 ఆగస్టు (హి.స.)
రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. సీమ వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుని నిధుల కేటాయింపులు చేయడంతో పాటు వివిధ పథకాల అమలులో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. గత రెండేళ్లలో ఇక్కడ రూ.8,022కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టారు. జలసంరక్షణ, రోడ్ల నిర్మాణం, తాగునీటి సరపరా, మినీగోకులాలు, ఉద్యాన సాగు, పారిశుధ్యం తదితర అంశాల్లో విశేష ఫలితాలు సాధించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం 13,326 పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గం మైసూరాపల్లి గ్రామాన్ని వేదికగా చేసుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పంటకుంటల నిర్మాణానికి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచర్లలో శ్రీకారం చుట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ