
అమరావతి, 31 ఆగస్టు (హి.స.)
మార్కాపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు.
సీఎం చంద్రబాబు ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఉదయం 10.15 గంటలకు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రికి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత ఉదయం 10.25 గంటలకు సీఎం చంద్రబాబు రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10.35 గంటల నుంచి 11.20 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ముఖ్యమంత్రి ప్రారంభించడంతో పాటు ప్రాజెక్టు ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారు.
అనంతరం వెలిగొండ ప్రాజెక్టు గేట్లను ప్రారంభించి కృష్ణా జలాలను వెలిగొండకు విడుదల చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 11.30 గంటలకు గంటవానిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. గంటవానిపల్లిలో నిర్వహించే ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వచ్చే సాగు, తాగునీటి ప్రయోజనాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం మాట్లాడనున్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు తిరుగు ప్రయాణం ప్రారంభించి.. మధ్యాహ్నం 2.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ