
హుస్నాబాద్, 30 ఆగస్టు (హి.స.)
భీమదేవరపల్లి, మండలం లోని ముత్తారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 'పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున ముత్తారం గ్రామంలో మంత్రి పర్యటించారు. ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలనలో భాగంగా ముత్తారం గ్రామానికి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరిందని మంత్రి తెలిపారు. 8 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 153 మందికి పెన్షన్ల కింద రూ.41.57 లక్షలు, 271 కుటుంబాలకు గృహ జ్యోతి పథకం ద్వారా రూ.45.43 లక్షల ప్రయోజనం అందిందన్నారు. 158 మంది రైతులకు రూ.1.35 కోట్ల రుణమాఫీ, 430 మంది రైతులకు రైతుభరోసా కింద రూ.2.18 కోట్లు అందించినట్లు వివరించారు.
రైతుబీమా కింద ఓ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందించినట్లు తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో 63 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు 422 కార్డులకు సన్నబియ్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మంత్రి సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..