ముందస్తు క్యాన్సర్ నిర్ధారణే కీలకం.. కడియం శ్రీహరి
ముందస్తు క్యాన్సర్ నిర్ధారణే కీలకం.. కడియం శ్రీహరి
MLA


వరంగల్, 30 ఆగస్టు (హి.స.)

గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాదు చెందిన ప్రముఖ కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జఫరఢ్ మండలం తిడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఫన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిబిరంలో అందుబాటులో ఉంచిన అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ పరికరాలను వైద్య బృందంతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.

ఏయే రకాల క్యాన్సర్లను ఈ పరికరాల ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చనే వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన గ్రామస్తులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. ముందస్తు పరీక్షలతో మెరుగైన ఆరోగ్యం సాధ్యమని వారికి ధైర్యం చెప్పారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనశైలి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం, వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించలేకపోవడం వల్ల చాలామంది పేదలు క్యాన్సర్ బారిన పడి అకాల మరణం చెందుతున్నారని అన్నారు.

ఇలాంటి విషాదాలను నివారించాలంటే ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించేందుకు వైద్య శిబిరాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించే అత్యాధునిక సదుపాయాలతో తిడుగు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ వైద్య సేవలను ఒక్క గ్రామానికే పరిమితం చేయకుండా నియోజకవర్గం అంతటా విస్తరించాలని ఆకాంక్షించారు.

ఇందులో భాగంగా స్టేషనఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో త్వరలో భారీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కిమ్స్ ఆసుపత్రి వైద్య బృందాన్ని ఎమ్మెల్యే కోరారు. అవసరమైతే తానే స్వయంగా హైదరాబాద్ వెళ్లి కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడతానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande