
హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) హిందూ సమాజమంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ రెండు పార్టీలు మైనారిటీ సంతూష్టీకరణ విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ మైనారిటీ సంతూష్టీకరణ విధానాలకు పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ దీపావళి నాడు ఆలయంలో వెయ్యి మంది మహిళలను, పిల్లలను కాల్చి చంపిన నీచుడని.. అటువంటి దుర్మార్గుడిని హీరోగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాలు పెట్టడం కరెక్టేనా? అని ప్రశ్నించారు.
ఆదివారం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించారు. వాస్తవాలు చెబితే కాంగ్రెస్కు కడుపు మంటగా ఉంది. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు సరే.. నిధులేవి?. హైదరాబాద్లో 3,400 ఆలయాలుంటే బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు విదిలిస్తారా?. రంజాన్ పండుగకు మాత్రం రూ.33 కోట్లు విడుదల చేస్తారా?. బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు’ అని అన్నారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇస్తే.. 80 శాతం మంది హిందువుల పండుగకు ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి. విదేశాలు నిషేధించిన తస్లీమా జమాతే సంస్థ సభకు కూడా రూ.2.40 కోట్లు విడుదల చేస్తారా?. నేను హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా. గోమాతను వధిస్తే ప్రశ్నించాలా? వద్దా?. హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ప్రశ్నించాలా? వద్దా?. 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే ప్రశ్నించవద్దా?. నేను బరాబర్ సనాతన ధర్మం కోసం పని చేస్తా. హిందువులంతా జాగృతం కావాలి. హిందువులారా జెన్ జీలను స్పూర్తిగా తీసుకోండి’..
‘ఆకాశంలోకి రాకెట్లను పంపడమే కాదు.. హిందూ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. జెన్ జీల తీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది. బోనాల ఉత్సవాలకు ఏటా వస్తూనే ఉన్నా. ఎన్నికలకు బోనాలకు సంబంధమే లేదు. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు.. రాజకీయ పార్టీ. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. హైడ్రా 150 పోస్టులకు ఫిజికల్ టెస్ట్ పెడితే సరూర్ నగర్ స్టేడియం నిండిపోవడమే నిదర్శనం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానన్న హామీ ఏమైంది?. ఉద్యోగాలను భర్తీ చేసేదాకా నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తానన్న హామీ ఏమైంది?. రోజ్ గార్ మేళాతో 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మోదీదే. ఫీజు రీయంబర్స్ మెంట్ అందక పేద విద్యార్థులు అల్లాడుతున్నారు’ అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్