
పాయకరావుపేట,, 09 ఆగస్టు (హి.స.)
: మేజర్ పంచాయతీ పాయకరావుపేటను మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల పట్టణానికి చెందిన తెదేపా నాయకులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మున్సిపాలిటీ ప్రతిపాదన తీసుకువచ్చారు. పట్టణం మరింత అభివృద్ధి పథంలో పయనించాలన్నా, పెద్దఎత్తున గ్రాంట్లు రావాలన్నా పురపాలక సంఘంగా మార్చడమే మేలని వివరించారు. దీనిపై నాయకులంతా నిర్ణయాన్ని తెలియజేస్తే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై పట్టణంలో చర్చ మొదలైంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఊరిని మున్సిపాలిటీగా మార్చాలంటే 30 వేల జనాభా ఉంటే సరిపోతుంది. 2021 ముందు మున్సిపాలిటీ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 27 వేలు మాత్రమే ఉంది. పక్కనే ఉన్న పి.ఎల్.పురం, అరట్లకోట గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చాలని నిర్ణయించారు. దీనిలోభాగంగానే నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేటలను మున్సిపాలిటీలుగా పేర్కొంటూ జీఓ విడుదల చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో చోడవరం, పాయకరావుపేటలను పంచాయతీలుగానే కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇంటి పన్నులు ఏడాదికి రెండు సార్లు కట్టాల్సి రావడం, ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోతాయనే ఆందోళన నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఆగిపోయింది. అంతేగాక పి.ఎల్.పురం గ్రామస్థులు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ