రిజర్వేషన్ల వల్లే మనమంతా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నాము. హరీష్ రావు
రిజర్వేషన్ల వల్లే మనమంతా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నాము. హరీష్ రావు
Harish Rao


సిద్దిపేట, 09 ఆగస్టు (హి.స.)

సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేసి, వారిని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి మహనీయులు కల్పించిన రిజర్వేషన్ల వల్లే మనమంతా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్నామని తెలిపారు.

నాకు సమాజం ఏం చేసింది అని అడిగేవాళ్లే ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో, మేము సమాజానికి ఏం చేయగలం అని ఆలోచించి, ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతినెలా వెయ్యి రూపాయలు పక్కనపెట్టి 10 లక్షల రూపాయల నిధిని ఏర్పాటు చేయడం గర్వకారణమని హరీశ్రావు అన్నారు. ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు అండగా నిలబడుతూ, ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇవ్వడం రాష్ట్రానికే ఆదర్శమని అన్నారు. ఐదేళ్ల క్రితం ఫీజు కట్టలేక నా దగ్గరకు వచ్చిన హౌసింగ్ బోర్డుకు చెందిన రోహిత్ అనే అబ్బాయికి నేను సహాయం చేశానని తెలిపారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏడాదికి 6 లక్షల జీతం వస్తోందని పేర్కొన్నారు. తన తొలి ఏడాదంతా సంపాదించిన 6 లక్షల రూపాయలను తీసుకొచ్చి తిరిగి పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయమని నాకే ఇచ్చాడని అన్నారు. కష్టపడి పైకొచ్చిన ఆ అబ్బాయి ఆలోచనా విధానం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు.కేసీఆర్ హయాంలో దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు పెంచామని తెలిపారు.

సిద్దిపేటలో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ తెచ్చామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, దళిత బంధు లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ కు బడ్జెట్ లో 5,403 కోట్లు కేటాయించి, ఖర్చు పెట్టింది కేవలం 74 కోట్లు మాత్రమే. ఆ 74 కోట్లు కూడా జీతాలు, కరెంట్ బిల్లులకే సరిపోయాయని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క నిరుపేద దళిత యువకుడికి గానీ, రైతుకు గానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పైసా సహాయం అందలేదని చెప్పారు. దళితబంధు కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి, బడ్జెట్ లో 2000 కోట్లు పెట్టి.. ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి సహాయం చేశారా? అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande