ఘనంగా లష్కర్ బోనాలు
ఘనంగా లష్కర్ బోనాలు
Bonalu


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.)

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు ఇవాళ ఉదయం నుంచి ఘనంగా కొనసాగుతున్నాయి. ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు కావడంతో భాగ్యనగరం అంతా అమ్మవారి బోనాలతో నగరమంతా ప్రత్యేక శోభ సంతరించుకుంది. నగరంలోని ఆయా ప్రాంతాల్లో కొలువైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, భవాని, మహాంకాళి తదితర అమ్మవార్ల ఆలయాలకు బోనం సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. మహిళలు వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలు నెత్తినపెట్టుకుని అమ్మవార్ల ఆలయాలకు బయలెల్లారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బెల్లం సాకపోసి బోనం నైవేద్యంతోపాటు గాజులు, చీరెసారె సమర్పించి తల్లి చల్లంగ చూడమని వేడుకుంటున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువుల చప్పుళ్లతో ఎటు చూసినా నగరమంతా హోరెత్తుతోంది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారకి ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించగా, అక్కన్న మాదనన్న మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీధర్ బాబు, అంబర్ పేట అమ్మవారి ఆలయంలో ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క పట్టువస్త్రాలు సమర్పించారు. మాదన్నపేట నల్లపోచమ్మను కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రోహ్మోత్సవాలు కావడంతో అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

తెల్లవారుజామునుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలకంరణ చేపట్టారు. దేవాలయం తరఫున అమ్మవారికి తొలిబోనం సమర్పించగా రాత్రి 10:30 వరకు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం, చీర, సారే సమర్పణ జరగనుంది. ఈరోజు సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనానికి 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు రంగం, భవిష్య వాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథ యాత్ర జరగనుంది.

సింహవాహినీ అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెండ్డి వంగా దర్శించుకున్నారు.జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, సింగర్ మంగ్లీ అమ్మవారికి బోనం సమర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande