
హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) బోనాల పండుగను పురస్కరించుకుని అంబర్పేట మహంకాళి అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రి సీతక్కకు ఆలయ నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్లు కూడా అంబర్పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలంతా సంతోషంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్