
హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) తెలంగాణలో నక్సలిజం (మావోయిజం)
పూర్తిగా అంతమైందని, రాష్ట్ర భద్రతకు ఇక ఎలాంటి ముప్పు లేదని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ శాఖలో సమూల మార్పులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై డీజీపీ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా మావోయిస్టుల అదుపుపైనే దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం, ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ముందున్న అతిపెద్ద సవాలు మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం, అక్రమ రవాణా. యువతను, విద్యార్థులను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నాం, అని ఆయన పేర్కొన్నారు.
కొందరు రాజకీయ నాయకులు తమ గన్ మెన్లను తగ్గించారని పదే పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో డీజీపీ కీలక వివరణ ఇచ్చారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గడంతో, దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ ప్రజాప్రతినిధుల భద్రతను సమీక్షించి తగ్గించాం. భద్రతను పూర్తిగా తొలగించలేదు. కేవలం (Threat Perception) ముప్పు స్థాయిని బట్టి అవసరమైన మేరకు మాత్రమే తగ్గించాం. నిఘా వర్గాల నివేదికలు, సెక్యూరిటీ కమిటీ సూచనల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో భారీ సంస్కరణలు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. మావోయిస్టుల ఏరివేతలో కీలక పాత్ర పోషించిన గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి బలగాల సేవలను ఇకపై సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ, మరియు ఆహార కల్తీ ముఠాల పట్టుకోసం వినియోగించనున్నారు. త్వరలోనే కొత్త 'తెలంగాణ పోలీస్ మాన్యువల్ ను తీసుకురాబోతున్నామని, శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని డీజీపీ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..