
పశ్చిమగోదావరి,, 01 సెప్టెంబర్ (హి.స.)
:45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు నరసాపురం వచ్చానని..అనేక పాలనా సంస్కరణలకు నాంది పలికామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మొగల్తూరులో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడుతూ.. తనకు మొగల్తూరు కొత్తేమీ కాదన్నారు. ప్రజా కార్యక్రమాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసం జరిగిందని విమర్శించారు. అటువంటి పరిస్థితి నుంచి 94 శాతం సీట్లలో, 54 శాతం ఓట్లతో కూటమిని ప్రజలు గెలిపించారని అన్నారు.
మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి డ్వాక్రా సంఘాలను స్థాపించామని సీఎం తెలిపారు. తన తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ప్రస్తుతం మగవారితో సమానంగా ఆడవారు ఎదిగారని అన్నారు. భవిష్యత్తులో మగవారిని మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తూ ఆదుకుంటున్నామన్నారు. దేశంలో నాలుగు వేలు, ఆరువేలు, పదివేలు, పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీనే అని అన్నారు. ఇప్పటి వరకూ 75 వేల 503 కోట్ల రూపాయలను పెన్షన్లు ఇచ్చామని.. ఆ డబ్బుతో మూడు పోలవరం ప్రాజెక్ట్లు కట్టవచ్చన్నారు. ఆర్థిక అసమానతలు పోవాలని.. అందరికీ సంక్షేమం అందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
నా ఆశయాన్ని ఆపలేరు..
కొన్ని రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని.. వాటిని మహిళలు నడపాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూస్తామని చెప్పారు. మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఆర్థిక సహాయాన్ని ఇవ్వడాన్ని తానే ప్రారంభించానని తెలిపారు. ఎలాంటి మంచి పనులు చేసినా అడ్డుపడుతున్నారని ప్రతిపక్షంపై మండిపడ్డారు. ఏజెన్సీలోని పిల్లలకు మెరుగైన విద్య అందిస్తే, ప్రపంచంలోనే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. వాటన్నింటికీ గొడ్డలి పార్టీ అడ్డుపడుతోందని విమర్శించారు. ‘ఎంత అడ్డుపడినా నా ఆశయాన్ని ఆపలేరు’ అని స్పష్టం చేశారు.
త్వరలో ఏసీ బస్సులు వస్తున్నాయని.. మహిళలు ఉచితంగా ఆ బస్సుల్లో ఎక్కే రోజులు రాబోతున్నాయని తెలిపారు. మహిళలు ఇంటిపైన సోలార్ పెట్టుకుంటే విద్యుత్ తయారు అవుతుందని.. దానివలన కొన్ని రోజుల్లో ఉచితంగా కరెంటు పొందవచ్చని సూచించారు. వేసవికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి.. ఏసీలు పెట్టుకోవచ్చని.. అదనంగా ఉండే విద్యుత్ను అమ్ముకోవచ్చన్నారు. ప్రతి ఇంట్లో ఒక చిన్న పారిశ్రామికవేత్త రావాలని వన్ హౌస్- వన్ ఆంత్రప్రెన్యూర్ అనే పథకాన్ని తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ