గొల్లగుప్పలో క్లోరోక్విన్ వికటించి బాలిక మృతి
గొల్లగుప్పలో క్లోరోక్విన్ వికటించి బాలిక మృతి
cloro


అమరావతి, 02 సెప్టెంబర్ (హి.స.)

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోక్విన్ వికటించి బాలిక మృతి చెందడంతోపాటు పలువురు అనారోగ్యం పాలైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, పోలవరం జిల్లా కలెక్టర్తో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ ఘటనపై ఆయన పూర్తి సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం 71 మందికి ఈ మందులు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు.

అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. మరో 24 మందికి లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని చింతూరు ఐటీడీఏ పీవో, ఏఎస్పీ తెలుసుకున్నట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు.

ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సీఎంకు అధికారులు చెప్పారు. అయితే ఈ క్లోరోక్విన్ మాత్రలు వికటించి.. ఇద్దరు చనిపోయారనే దానిలో వాస్తవం లేదని అన్నారు. కాకినాడ జీజీహెచ్ నుంచి ఇప్పటికే 9 మంది సభ్యుల వైద్య బృందాన్ని గొల్లగుప్పకు పంపామని పేర్కొన్నారు. మరో మూడు ప్రత్యేక బృందాలు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ నుంచి బయలుదేరాయని సీఎంకు జిల్లా కలెక్టర్ దినేష్ వివరించారు.

బాధితులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స..

గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన 34 మందికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 33 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స పొందుతున్న వారిలో 31 మంది చిన్నారులు.. ఇద్దరు పెద్దలు ఉన్నారు. లక్ష్మీపురం పీహెచ్సీలో19 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 17 మంది చిన్నారులు, ఇద్దరు పెద్దలు ఉన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా వారిలోని 13 మంది చిన్నారులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ వివరించారు.

గొల్లగుప్పలో 74 మందికి క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. వీటి వల్ల పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ట్యాబ్లెట్ వికటించి.. విద్యార్థి జమున (7) మృతి చెందింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande