
తిరుమల , 02 సెప్టెంబర్ (హి.స.) తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కొరడా ఝుళిపించారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు, బుధవారం ఉదయం నుంచే ముమ్మర సోదాలు చేపట్టారు. తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం నివాసంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించాయి. ఇంట్లోని విలువైన దస్తావేజులు, స్థిర, చరాస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
లోకనాథం నివాసం తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా అధికారులు గురిపెట్టి మొత్తం 5 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఉన్న లోకనాథం ఇద్దరు బావమరుదుల నివాసాలతో పాటు ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలోని ఆయన సోదరుడి ఇంట్లోనూ ఏసీబీ బృందాలు విడివిడిగా తనిఖీలు చేపట్టాయి. అంతేకాకుండా తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న లోకనాథం అధికారిక కార్యాలయంలోనూ అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకుని ఆరా తీస్తున్నారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. కాగా ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV