
కాకినాడ,, 01 సెప్టెంబర్ (హి.స.)
తనను మోసగించి.. బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్నాడంటూ ఓ వ్యక్తిపై కాకినాడ జిల్లా ఎస్పీకి హిందూ మహిళ ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతలతో కలిసి ఆమె పీజీఆర్ఎస్లో ఈ ఫిర్యాదు చేసింది. కాకినాడ జగన్నాథపురం చిన మార్కెట్లోని మటన్ షాపు నిర్వహించే షేక్ గౌస్ ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పి తనను ముస్లిం పద్ధతిలో వివాహం చేసుకున్నాడని ఆ ఫిర్యాదులో బాధితురాలు స్పష్టం చేసింది. అయితే తనలాగే అతడు మరో ఐదుగురు హిందూ యువతులను వివాహం చేసుకుని మోసం చేశాడని వివరించింది.
అతడి చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం తాను పలుమార్లు చేశానని తెలిపింది. కానీ మటన్ షాపులో కత్తులు చూపించి చంపేస్తానంటూ తనను బెదిరించే వాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయింది. అయితే గతంలో గౌస్ చేతిలో మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదుతో అతడిపై ఇప్పటికే ఓ కేసు నమోదు అయిందని తెలిపింది. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొంది.
తనకు బెయిల్ ఇప్పించాలంటూ తమపై అతడు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడని పేర్కొంది. బెయిల్ ఇప్పించకుంటే.. బయటకు వచ్చిన తర్వాత చంపేస్తానంటున్నాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. జైలు నుంచి గౌస్ బయటకు వస్తే.. తనతోపాటు మిగిలిన ఐదుగురు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీకి బాధితురాలు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గౌస్పై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ