హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ
హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ
హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే అతిపెద్ద జాతీయ రహదారి ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65)ని పూర్తిస్థాయిలో 6 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా విస్తరించేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రూవల్ కమిటీ (PPPAC) అనుమతి ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దాదాపు రూ.12,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ విస్తరణ పనులను చేపట్టబోతున్నారు.

హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల మధ్య నిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణించే ప్యాసింజర్ వాహనాలు, సరుకు రవాణా లారీల వల్ల రహదారిపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్లు ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ 6 లైన్ల విస్తరణతో పాటు ప్రధాన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, బైపాస్ రోడ్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం దాదాపు గంటన్నర వరకు తగ్గడమే కాకుండా, ప్రమాదాల నివారణకు వీలవుతుంది.

మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, విజయవాడ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఈ రహదారి కనెక్టివిటీ విస్తరించడం. మచిలీపట్నం వద్ద శరవేగంగా రూపుదిద్దుకుంటున్న బందరు పోర్టుకు సరుకు రవాణా చేయడానికి ఈ రహదారి ఒక ప్రధాన కారిడార్‌గా మారనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక ఉత్పత్తులను పోర్టుకు చేరవేయడానికి ఈ కనెక్టివిటీ ఎంతో దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా రంగం సరికొత్త పుంతలు తొక్కుతుందని రవాణా రంగ నిపుణులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande