
కర్నూలు, 01 సెప్టెంబర్ (హి.స.)వర్షాకాలం లేదంటే చలికాలంలో వేడివేడి బెల్లం టీ తాగడం వల్ల శరీరానికి మంచి శక్తి, ఉపశమనం లభిస్తాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, చాలామందికి బెల్లం టీ చేసేటప్పుడు పాలు విరిగిపోతుంటాయి. కొద్దిపాటి జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే విరిగిపోకుండా పర్ఫెక్ట్ బెల్లం టీ తయారు చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
పాలు విరగకుండా టీ చేయడానికి ముఖ్యమైన చిట్కాలు:
టీ డికాక్షన్ తయారు చేసేటప్పుడు పాలను నేరుగా నీటిలో వేసి మరిగించకూడదు. పాలను వేరే పాత్రలో బాగా కాచి, వేడిగా ఉన్నప్పుడే డికాక్షన్లో కలపాలి. నీటిలో టీ పొడి, అల్లం, యాలకులు లేదా మసాలా దినుసులు వేసి బాగా మరిగించాలి. డికాక్షన్ సిద్ధమైన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి లేదా మంట పూర్తిగా తగ్గించిన తర్వాత మాత్రమే బెల్లం కలపాలి. ఇది కూడా రసాయనాలు లేని శుద్ధమైన ఆర్గానిక్ బెల్లం లేదా బెల్లం పొడిని వాడటం వల్ల పాలు విరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఈ చిన్న మార్పులు చేయడం ద్వారా మీ బెల్లం టీ ఎప్పటికీ విరిగిపోకుండా, అద్భుతమైన రుచితో తయారవుతుంది. ప్రతిరోజూ ఉదయం ఈ హెల్దీ టీని ఆస్వాదించండి!
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV