
అమరావతి, సెప్టెంబర్ 1(హి. స )
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సెప్టెంబర్ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా, సమర్థవంతంగా ప్రారంభించింది. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒకే విడతలో పింఛన్ సొమ్ము అందించడానికి ప్రభుత్వం రూ.2,693.90 కోట్ల భారీ బడ్జెట్‌ను ముందస్తుగానే విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 61.92 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు వివిధ చేతివృత్తుల లబ్ధిదారులకు ఒకే రోజులో గరిష్టంగా పింఛన్లు పంపిణీ చేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేసింది.
తెల్లవారుజామున 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు మరియు ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల తలుపు తట్టి పింఛన్ సొమ్మును నగదు రూపంలో అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మంత్రులు, స్థానిక శాసనసభ్యులు స్వయంగా అవ్వాతాతలు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు ఇచ్చి, వారి ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న బాధితులకు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సైతం సిబ్బంది అక్కడికే వెళ్లి డబ్బులు అందించడం గమనార్హం.
ఎండల్లో, వర్షాల్లో బ్యాంకులు లేదా ప్రభుత్వ కార్యాలయాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే అవసరం లేకుండా, నెల ప్రారంభంలోనే ఇంటి వద్దకే వచ్చి గౌరవప్రదంగా పింఛన్ అందించే ఈ విధానం పట్ల లబ్ధిదారుల నుంచి విశేష హర్షం వ్యక్తమవుతోంది. కాగా, సాంకేతిక కారణాల వల్ల లేదా ఊర్లలో అందుబాటులో లేని వారికి రాబోయే రెండు రోజుల్లో పింఛన్ అందజేస్తామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా సరికొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన మరో 3 లక్షల మందికి త్వరలోనే కొత్త పింఛన్ కార్డులు మంజూరు చేసేందుకు సర్వే ప్రక్రియ తుది దశకు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi