కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు హైకోర్టు లో ఊరట
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు హైకోర్టు లో ఊరట
ts highcourt


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణలో అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ పథకాల అమలును నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. దీంతో ఈ పథకాల కొనసాగింపునకు మార్గం సుగమమైంది.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో, విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి పథకాల అమలుపై మధ్యంతర స్టే విధించారు.

సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ పథకాలు 2014 నుంచి నిరంతరాయంగా అమలవుతున్నాయని, పిటిషనర్ లబ్ధిదారుడు కానందున ఆయనకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని కోర్టుకు తెలిపారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై దాఖలైన ఇలాంటి వ్యాజ్యాలను డివిజన్ బెంచ్ మాత్రమే విచారించాలని వాదించారు. షాదీ ముబారక్ వంటి పథకాలకు సుప్రీంకోర్టు కూడా గతంలో అనుమతినిచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తాజా నిర్ణయంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు రాష్ట్రవ్యాప్తంగా యథావిధిగా కొనసాగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande