
అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేసి కార్పొరేట్ స్కూళ్లను తలపించేలా సకల సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
నెల్లూరు నగరంలో మొత్తం 15 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే వీఆర్సీ స్కూల్ను ఆధునికీకరించారు. ఈ నేపథ్యంలో బుధవారం నెల్లూరు పట్టణం స్టోన్ హౌస్ పేటలో ఆధునికీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్కు నెల్లూరు ఎంపీ, వీపీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల భవనాలను రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాల మొత్తం కలియతిరిగి తరగతి గదులు, ల్యాబ్స్, డైనింగ్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరాతీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ