
మదనపల్లె , 19 సెప్టెంబర్ (హి.స.)మదనపల్లె పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా హోటల్లోని కిచెన్లో మంటలు వ్యాపించాయి.
ఉదయం సుమారు 4:50 గంటల సమయంలో హోటల్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఇన్చార్జ్ అగ్నిమాపక కేంద్రాధికారి జె. బాబయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగతో వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకుని పూర్తిగా ఆర్పివేశారు.
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని హోటల్ యజమాని ఎస్పి పృథ్వీరాజ్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV