
అమరావతి , 20 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో విద్యుత్, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సుమారు 450 ఎంఎస్ఎంఈ యూనిట్లలో ఎనర్జీ, వాటర్ ఆడిట్లు నిర్వహించనున్నారు.
పరిశ్రమల్లో విద్యుత్, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంలో కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్, నీరు వంటి వనరులపై ఖర్చు ఉత్పత్తి వ్యయంలో గణనీయమైన భాగంగా ఉంటుంది. వినియోగంలో వృథాను గుర్తించి సాంకేతిక పరిష్కారాలు సూచించడం ద్వారా పరిశ్రమలకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.
ఆడిట్ సందర్భంగా పరిశ్రమల్లో విద్యుత్ వినియోగించే పరికరాలు, మోటార్లు, పంపులు, లైటింగ్ వ్యవస్థలు, నీటి వినియోగ పద్ధతులు వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఎక్కడ అధిక వినియోగం జరుగుతోంది, ఎక్కడ పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగించవచ్చు, ఎక్కడ నీటి పునర్వినియోగం సాధ్యమవుతుంది వంటి అంశాలను గుర్తించడం ఈ కార్యక్రమంలో కీలకం.
ఎంఎస్ఎంఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేలాది చిన్న పరిశ్రమలు స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో శక్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పరిశ్రమల పోటీ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యావరణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
ఈ ఆడిట్లను దశలవారీగా నిర్వహించి ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్