
అమరావతి , 20 సెప్టెంబర్ (హి.స.)తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన గరుడసేవకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శనివారం జరిగిన గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తిరుమలలోని నాలుగు మాడ వీధుల వెంట ఏర్పాటు చేసిన గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. కొన్ని నివేదికల ప్రకారం సుమారు మూడు లక్షల మంది వరకు భక్తులు గరుడసేవను దర్శించుకున్నారు.
శ్రీవారు గరుడ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగే సందర్భాన్ని అత్యంత పవిత్రంగా భావించే భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకున్నారు. గ్యాలరీల్లో స్థలం లభించని భక్తులు కూడా మాడ వీధుల వెంట నిలబడి స్వామివారి వాహనసేవను వీక్షించారు. పలువురు భక్తులు హారతులు ఇచ్చి తమ భక్తిని చాటుకున్నారు.
భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేకమైన రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తులు ఒకేసారి పెద్ద సంఖ్యలో నిర్దిష్ట ప్రాంతాలకు చేరకుండా మార్గాలను నియంత్రించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్