
హైదరాబాద్ , 20 సెప్టెంబర్ (హి.స.)వరంగల్ మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ల్యాండ్ అక్విజిషన్ (భూసేకరణ) ప్రక్రియ ఎట్టకేలకు పూర్తిగా ముగిసిందని, సేకరించిన భూమిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కి అధికారికంగా అప్పగించామని ఆయన స్పష్టం చేశారు.
ఈ విమానాశ్రయ విస్తరణకు అవసరమైన అదనపు భూమిని సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 295 కోట్లను కేటాయించి ఆ ప్రక్రియను పూర్తి చేసింది. దీనికి అనుగుణంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇప్పటికే విమానాశ్రయ నిర్మాణ పనుల కోసం రూ. 213.59 కోట్లతో టెండర్లను కూడా పిలిచింది. ఈ నిధులతో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ భవనం, ఏటీసీ (ATC) టవర్, ఫైర్ స్టేషన్ మరియు రన్వే పనులు చేపట్టనున్నారు.
ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యంగా పెట్టుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్