వైసీపీ నేతల విమర్శలు పట్టించుకోం: మంత్రి నారాయణ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారాయణ


నెల్లూరు, 20 సెప్టెంబర్ (హి.స.) వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నెల్లూరు జిల్లాలోని దొంతాలి లెగసీ వేస్ట్ ప్లాంటును మంత్రి నారాయణ ఈరోజు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. చెత్తని కాలుస్తున్నారని వైసీపీ నేతలు అవివేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చదువుకున్న వారు కూడా అజ్ఞానంతో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.

గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి నారాయణ, నాటి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతూ చెత్త పన్ను వసూలు చేయడమే తప్ప, పారిశుధ్యాన్ని పూర్తిగా పక్కనబెట్టిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 153 లక్షల టన్నుల చెత్తను పేరుకుపోయేలా చేసి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-19 టీడీపీ హయాంలో నెల్లూరులో ఏర్పాటు చేయతలపెట్టిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ను విజన్ లేని గత ప్రభుత్వం రద్దు చేసిందని, అలాగే నెల్లూరు పాత మురుగునీటి పారుదల (UGD) పనులను నిలిపివేసి హడ్కో రుణాలను కూడా చేజార్చుకునేలా చేసిందని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande