సీఎం పర్యటనను విజయవంతం చేయాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్
ఈనెల 30న కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
Ponnam


కరీంనగర్, 24 సెప్టెంబర్ (హి.స.)

కరీంనగర్ లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 30న ముఖ్యమంత్రి ప్రారంభించనున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్ ప్రధాన ద్వారంతో పాటు కార్యాలయ భవనాన్ని సుందరంగా అలంకరించాలని, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ ఛాంబర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.

కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా భవనం పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రధాన ద్వారం, కలెక్టర్ కార్యాలయం, ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలతో పాటు ఇతర ముఖ్య ప్రాంగణాలను సుందరంగా అలంకరించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande