
వనపర్తి, 24 సెప్టెంబర్ (హి.స.)
గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలోని గర్భిణీల పరీక్షల విభాగం, ఇతర వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా తెలుసుకున్నారు. ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. గర్భిణీలకు అందుతున్న వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గర్భిణీలలో హిమోగ్లోబిన్ స్థాయిలను తప్పనిసరిగా పరీక్షించాలని, హిమోగ్లోబిన్ స్థాయిని బట్టి అవసరమైన చికిత్స, మందులు అందించి రక్తహీనతను తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు.
అనంతరం ఆసుపత్రిలోని స్కానింగ్ గదిని కలెక్టర్ పరిశీలించి, స్కానింగ్ వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు