
అమరావతి , 25 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2026కు సంబంధించిన సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఈ సమ్మిట్ను కేవలం అవగాహన ఒప్పందాల కార్యక్రమంగా పరిమితం చేయకుండా వాస్తవ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, స్టార్టప్లకు అవకాశాలు కల్పించే వేదికగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సమ్మిట్కు ముందుగా విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో ఐదు ప్రాంతీయ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 7 నుంచి 26 మధ్య ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పారిశ్రామిక రంగాలను కేటాయించి పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
విశాఖ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, ఐటీ, ఫిన్టెక్, సెమీకండక్టర్లు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఫార్మా, మెడ్టెక్ రంగాలపై దృష్టి పెట్టనున్నారు. కాకినాడలో మారిటైమ్, షిప్బిల్డింగ్, కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా, ఆక్వా ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రోత్సహించనున్నారు. గుంటూరులో రాజధాని అభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాలు, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అనంతపురంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, సహజ వ్యవసాయం, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక ఇంధన రంగాలపై చర్చలు జరగనున్నాయి. తిరుపతి సమావేశంలో పర్యాటకం, హాస్పిటాలిటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, సెమీకండక్టర్లు, అంతరిక్షం, ఫుట్వేర్ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్