
అల్లూరి సీతారామరాజు జిల్లా , 25 సెప్టెంబర్ (హి.స.)భారీ వర్షాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రహదారి సంబంధాలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. గూడెం కొత్తవీధి మండలంలోని డి.అగ్రహారం ప్రాంతంలో వర్షాలకు ఒక వంతెన కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని వంతెనల వద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మడిగమ్మల, చోడిరాయి వంతెనల వద్ద నీటి ప్రవాహం పెరగడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాలపై ఆధారపడే సుమారు 32 గ్రామాలకు రహదారి సంబంధాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు బట్టునూరు వాగు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో మరో 11 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గ్రామాలకు వైద్య సేవలు, అత్యవసర రవాణా, నిత్యావసర సరుకులు, విద్యా సంస్థలకు రాకపోకలు ఈ మార్గాలపై ఆధారపడుతుంటాయి. ఒక వంతెన లేదా ప్రధాన రహదారి దెబ్బతింటే మొత్తం గ్రామాలే బయట ప్రపంచంతో సంబంధం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించడం, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడం, వాగులు దాటకుండా ఆంక్షలు విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్