
మహబూబాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
విచక్షణారహితంగా విద్యార్థులను కొట్టిన ఘటనపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ స్పందించారు. ఈ మేరకు వారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఇన్చార్జి డీఈవో రాములు శుక్రవారం వెల్లడించారు.
విద్యార్థులపై జరిగిన ఘటన, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపకుండా చూసిన వారిపై జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. అందులో భాగంగానే ఈ నెల 17వ తేదీన సదరు టీచర్కు షోకాజ్ నోటీసు జారీ చేసి, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా తెలిపారు.అనంతరం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా, ఘటన జరిగిన మూడు రోజుల వరకు విషయం అధికారులకు తెలపకుండా జాప్యం చేయడం, నిబంధనలకు విరుద్ధంగా బాలికల గురుకుల పాఠశాలలోకి ఆర్ఎంపీని పిలిపించి వైద్యం చేయించినట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించిన కురవి మండలం నేరడ కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాల ఎస్వో సరస్వతి, ఇంగ్లీష్ టీచర్ సుహాసినిలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు సర్వీసుల నుంచి రిమూవల్ చేసినట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..