
న్యూఢిల్లీ, 25 సెప్టెంబర్ (హి.స.)
దేశవ్యాప్తంగా అఖండ దేశభక్తిని చాటేందుకు విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘నమామి భారతం’ పేరుతో దేశవ్యాప్తంగా ఒకే సమయంలో, ఒకే లయతో, కోటి మంది గళాలతో సంపూర్ణ ‘వందేమాతరం’ గీతాలాపన నిర్వహించనున్నారు. సరిగ్గా నేడు ఉదయం 11:00 గంటలకు ఈ చారిత్రక కార్యక్రమం ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా ఉన్న శిశుమందిర్ పాఠశాలలు, విద్యాభారతి అనుబంధ విద్యాసంస్థలతో పాటు సుమారు 25 వేలకు పైగా ప్రాంతాలలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ మహా సంబురంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు కోటి మందికి పైగా పౌరులు భాగస్వామ్యులై ‘వందేమాతరం’ గీతాన్ని సంపూర్ణంగా ఆలపించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం చారిత్రక స్థానం సంపాదించేలా సన్నాహాలు చేశారు. కేవలం సామూహిక గానంతో సరిపెట్టకుండా, స్వాతంత్ర్యోద్యమంలో ‘వందేమాతరం’ ప్రాముఖ్యతను, దాని చారిత్రక ప్రస్థానాన్ని నేటి యువతకు తెలియజేసేలా ఈ వేదిక ఉపయోగపడనుంది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ప్రత్యేకంగా సాంస్కృతిక ప్రదర్శనలు, చర్చా వేదికలు మరియు సంభాషణాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు, జాతీయ గీతం ‘వందేమాతరం’ ఆవిర్భావానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. కళాక్షేత్రలోని శ్రీమంత శంకరదేవ్ అంతర్జాతీయ ఆడిటోరియంలో జరగనున్న ఈ వేడుకలకు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (రిటైర్డ్) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. యావత్ భరత జాతిని దేశభక్తి భావనతో ఏకం చేసే ఈ అపూర్వ కార్యక్రమం దేశవ్యాప్తంగా అంతులేని ఉత్సాహాన్ని నింపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi