దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు.. కలెక్టర్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా అందజేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.
కలెక్టర్


పెద్దపల్లి, 25 సెప్టెంబర్ (హి.స.)

ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా అందజేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.

భూసేకరణలో నష్టపరిహారం ఎక్కువగా ఇప్పిస్తామంటూ నమ్మబలికే దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కలెక్టర్ హెచ్చరించారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్ ప్రాంతాల్లో సింగరేణి సంస్థకు సంబంధించిన భూసేకరణ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొత్త జాతీయ రహదారులు, రైల్వే మార్గాల నిర్మాణం, విస్తరణ కోసం భూసేకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు.

ఈ భూసేకరణను ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు, మధ్యవర్తులు ప్రజలను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బాధితులకు రావాల్సిన నష్టపరిహారం వివరాలను సంబంధిత అధికారులు తెలియజేసి, నిబంధనల మేరకు నేరుగా అందజేస్తారని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande