'TG-TMARS' ఏర్పాటుకి జీవో నంబర్ 135 ను జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం (update)
తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఘోర రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి మరియు సమగ్ర రవాణా భద్రతను పర్యవేక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం 'TG-TMARS' (తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో) అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్
Telangana govt


హైదరాబాద్ , 25 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఘోర రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి మరియు సమగ్ర రవాణా భద్రతను పర్యవేక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం 'TG-TMARS' (తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో) అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవో నంబర్ 135 ను జారీ చేసింది.

ఈ కొత్త వ్యవస్థ ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ, చలానాల విధింపు వంటి సాధారణ ప్రక్రియలతో పాటు రోడ్డు ప్రమాదాలను శాస్త్రీయంగా తగ్గించడం. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంపై ఈ బ్యూరో ప్రధానంగా దృష్టి సారిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ ప్రత్యేక విభాగానికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) లేదా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) స్థాయి అధికారి డైరెక్టర్గా వ్యవహరిస్తారు. ఇది నేరుగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్న 'స్టేట్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్' పర్యవేక్షణలో పనిచేస్తుంది.

ఈ బ్యూరో 'ట్రాఫిక్', మరియు 'రోడ్ & రైల్ సేఫ్టీ' అనే రెండు ప్రధాన విభాగాలుగా పనిచేస్తుంది. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేందుకు, క్షతగాత్రులను 'గోల్డెన్ అవర్'లో ఆసుపత్రులకు తరలించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో రౌండ్-ది-క్లక్ అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక 'రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్'ను కేటాయిస్తారు. రాష్ట్ర లేదా జాతీయ రహదారులపై 50 కిలోమీటర్లకు పైగా ఉన్న పరిధిలో ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేస్తారు. వీటిలో అత్యాధునిక కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), మరియు స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి. అలాగే, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను సాంకేతికంగా విశ్లేషించి, అక్కడ అవసరమైన ఇంజినీరింగ్ మార్పులు చేపట్టేలా రోడ్డు నిర్వహణ శాఖలతో సమన్వయం చేసుకుంటుంది.

పోలీసులు వసూలు చేసే ట్రాఫిక్ జరిమానాల్లో 40 శాతం నిధులను 'ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఫండ్'కు మళ్లిస్తారు. ఈ నిధులను అత్యాధునిక సాంకేతికతను జోడించడానికి, పెట్రోలింగ్ వాహనాల కొనుగోలుకు మరియు సిబ్బంది శిక్షణకు ఉపయోగిస్తారు. రాష్ట్రంలో సుమారు 32,000 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లు మరియు 1.8 కోట్లకు పైగా ఉన్న రిజిస్టర్డ్ వాహనాల భద్రతను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ రాబోయే ఆరు నెలల్లో పూర్తిగా కార్యరూపం దాల్చనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande