
జనగామ, 26 సెప్టెంబర్ (హి.స.)
ఏ ఒక్క పేదవాడు కూడా పూరి గుడిసెలో నివసించకూడదన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గమంతా సమష్టిగా సంకల్పించి, రాష్ట్రంలోని ప్రతి గుడిసెను పక్కా ఇల్లుగా మార్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు.
శనివారం జనగామ నియోజకవర్గంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, అత్యంత నిరుపేదలైన గుడిసెలలో జీవిస్తున్న కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
జనగామ నియోజకవర్గ పరిధిలోని సుమారు 500 పూరిగుడిసెల కుటుంబాలను గుర్తించి, వారందరికీ నూతన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఉచితంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనుందని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు