
అమరావతి , 27 సెప్టెంబర్ (హి.స.)ఏపీలో గోదావరి వరద పరిస్థితి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొంత తగ్గినప్పటికీ, ఉపనదుల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా శబరి, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరద నీరు ప్రధాన ప్రవాహానికి చేరడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి విడుదల గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. నీటిమట్టం వేగంగా పెరగడం గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రభావం ధవళేశ్వరం వరకు చేరడానికి కొంత సమయం పడుతున్నందున దిగువ ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి పెట్టారు. రాజమహేంద్రవరం, పోలవరం పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వరద నీటి ప్రభావం వ్యవసాయ భూములపైనా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పొలాలు నీటమునిగినట్లు, గ్రామాలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పెరిగిన నీటి ప్రవాహాలను సాధ్యమైనంత సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అంశంపైనా ఆయన అధికారులతో చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్