
అమరావతి , 27 సెప్టెంబర్ (హి.స.)గ్రామీణ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటి సరఫరాను నిరంతరం కొనసాగించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, నాణ్యతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 512 సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు సుమారు 1.65 కోట్ల మంది ప్రజలకు తాగునీరు అందుతున్నట్లు అధికారులు వివరించారు.
తాగునీటి పథకాల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఫిల్టర్ బెడ్లు, నీటి నిల్వ ట్యాంకులు, ఫిల్టర్ హౌస్లు, పైపులైన్లు, పంపింగ్ వ్యవస్థలు తదితర ప్రాంతాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫిల్టర్ బెడ్లలోకి కప్పలు, బల్లులు, ఎలుకలు, పాములు, ఇతర కీటకాలు ప్రవేశించకుండా రక్షణ వలలు ఏర్పాటు చేయాలని సూచించారు. వెంటిలేటర్లు, ఓవర్ఫ్లో పైపులు, డ్రెయిన్ అవుట్లెట్ల వద్ద తుప్పు పట్టని మెష్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి వాటి ఫలితాలను సంబంధిత యాప్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. లీకేజీలు, విద్యుత్ సమస్యలు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్