త్వరలో విజయవాడలో 24వేల ఇళ్ల పట్టాలు అందిస్తాం .. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఈరోజు మంగళగిరిలో పర్యటించిన లోకేశ్ బహిరంగ సభలో మాట్లాడారు
నారా లోకేష్


అమరావతి , 28 సెప్టెంబర్ (హి.స.)మంత్రి నారాలోకేష్ మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. తాను 53వేల మెజారిటీ అడిగితే మంగళగిరి ప్రజలు 92వేల మెజారిటీ ఇచ్చారని అన్నారు.

బాధ్యత పెరిగిందని అహర్నిశలు తన ఆలోచన మంగళగిరి ప్రజల గురించేనని చెప్పారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఇంటిపట్టాల సమస్య ఉందని తనకు నాయకులు చెప్పారని సమస్య తనకు అర్థమైందని అన్నారు.

గడపగడప తిరిగినప్పుడు ప్రజలకు హామీ ఇచ్చానని చెప్పారు. సొంత ఇల్లు అనేది ఎమోషన్ అని కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఎవరో వచ్చి ఇది మీ ఇల్లు కాదని బయపెడతారని అన్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే తాను వచ్చానన్నారు.

విజయవాడలో 24వేల ఇంటి పట్టాలు అందిస్తాం..

2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినప్పుడు తాను కుంగిపోలేదని.. మరోసారి ఇక్కడే గెలవాలని పట్టుదలతో ముందుకెళ్లానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. పట్టాల సమస్య పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టుదలతో పనిచేస్తున్నామని అన్నారు. త్వరలో విజయవాడలో 24వేల ఇళ్ల పట్టాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. మంగళగిరిలో త్వరలో 100 పడకల ఆస్పతిని పూర్తి చేస్తామని వివరించారు. 2029లోపు మంగళగిరిలో గ్యాస్, తాగునీరు, భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లను అందిస్తామని చెప్పారు. దేశంలోనే ఏ పాఠశాల లేని విధంగా నిడమర్రు స్కూల్ను తీర్చిదిద్దామని ఉద్ఘాటించారు. నిడమర్రు స్కూల్ తరహాలో మిగతా స్కూళ్లను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

తొలి విడతలో 3,002 మందికి పట్టాలను పంపిణీ చేశామని మంత్రి లోకేశ్ అన్నారు. రెండో విడతలో 2,634 మందికి పట్టాలు అందజేశామని చెప్పారు. మొదటి రెండు విడతల్లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములకు ఉచిత శాశ్వత పట్టాలను పంపిణీ చేసినట్లు వివరించారు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ భూముల్లో నివసిస్తున్న పేదలకు హక్కులు కల్పించే చర్యలు చేపట్టామని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande