డిజిటల్ మోసాల కేసులపై సీబీఐ కీలక ఆపరేషన్
కేంద్ర దర్యాప్తు సంస్థ డిజిటల్ మోసాలపై నమోదైన కేసులపై కీలక ఆపరేషన్ చేపట్టింది.
Digital scam


ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.) కేంద్ర దర్యాప్తు సంస్థ డిజిటల్ మోసాలపై నమోదైన కేసులపై కీలక ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 89 చోట్ల సోదాలు జరిపింది. మూడు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురుని అరెస్టు చేసింది. వారి నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, డిజిటల్ పరికరాలు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

సైబర్ నేరగాళ్లు అనేక రాష్ట్రాల్లో డిజిటల్ అరెస్టులకు పాల్పడుతూ బాధితులను నుంచి రూ.కోట్లు కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. మూడు కేసుల్లో ప్రధాన నిందితులను అరెస్టు చేసింది. ఈ మూడు కేసుల్లోనే బాధితులు సుమారు రూ.42 కోట్లు నష్టపోయినట్లు సీబీఐ వెల్లడించింది.

బిట్స్ పిలానీకి సంబంధించిన ఓ కేసులో పోలీసు అధికారిగా నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మూడు నెలల పాటు డిజిటల్ అరెస్టుకు పాల్పడ్డారు. బాధితుడి నుంచి రూ.7.67 కోట్లు దోచుకున్నారు. గుజరాత్లో మరో కేసులోనూ పోలీసులుగా నటిస్తూ మరో వ్యక్తి నుంచి రూ.19.24 కోట్లు దోపిడీ చేశారు. కర్ణాటకకు సంబంధించిన కేసులోనూ బాధితుడిని నెల రోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసి రూ.14.45 కోట్లు తమ ఖాతాలకు మళ్లించుకోవడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande