
ఢిల్లీ , 04 సెప్టెంబర్ (హి.స.)ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు చేరింది. మోకాలి లోతులో వరద నీరు నిలిచిపోయింది. ఢిల్లీలోని రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది.
మరియు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును కూడా వరద నీరు ముంచెత్తింది. దీంతో విమానాల రాకపోలకు ఇబ్బంది ఎదురవుతోంది. సగటున విమానాలు 17 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాయంత్రం రావాల్సిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఎయిర్పోర్టులో నీరు చేరిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీతోపాటు హరియాణా, చండీగఢ్ ప్రాంతాల్లో, యూపీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్